Teluguinfo.com :: Sri Lanka travel guide, Sri Lanka, Sri Lanka tourist places, Sri Lanka tourism place, tourism place. - Naren Janyavula

శ్రీలంకను చుట్టేద్దాం... రండి!

రావణుడు ఏలిన నేల.. శ్రీసీతారాముల పాదాలతో తరించిన నేల శ్రీలంక. దక్షిణ భారత దేశానికి సమీపంలో… హిందూ మహాసముద్రంలో విస్తరించి ఉన్న దీవి. సింహళ, తమిళ భాషలు ఇక్కడ ప్రధానంగా మాట్లాడతారు. నగరాల్లో ఇంగ్లిష్ మాట్లాడేవారు కనిపిస్తారు. భిన్న రకాల సంస్కృతి, రామాయణ చారిత్రక విశేషాలతో కూడిన శ్రీలంక భారతీయ పర్యాటకుల జాబితాలో తప్పక ఉంటుంది. రాజధాని కొలంబో నుంచి మొదలు పెడితే దేశం నలుమూలలా విస్తరించి ఉన్న ఎన్నో అందాలను చూసి రావచ్చు. ఒక అనిర్వచనీయమైన, ఆనందానుభూతిని శ్రీలంక పర్యటనతో సొంతం చేసుకోవవచ్చు.
హైదరాబాద్ నుంచి కొలంబోకు విమానంలో వెళ్లేందుకు 7వేల రూపాయలు, చెన్నై నుంచి 5వేల రూపాయలు, బెంగళూరు నుంచి 6వేల రూపాయల స్థాయిలో టికెట్ ధరలు ఉన్నాయి. కొలంబోలో సిటీ బస్సు చార్జీలు 10 శ్రీలంక రూపాయలు (ఒక శ్రీలంక రూపాయి సమారుగా భారతీయ కరెన్సీలో అర్ధరూపాయితో సమానం) నుంచి 50 రూపాయల వరకు ఉన్నాయి. అయితే, అక్కడి బస్సులు బాగా కిక్కిరిసి ఉంటాయి. రైలు చార్జీలు తక్కువే అయినప్పటికీ అవి కూడా తక్కువ సర్వీసుల వల్ల జనంతో కిటకిటలాడుతుంటాయి. వీటికి బదులు కొంచెం ఖర్చయినా సరే ట్యాక్సీల్లో ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది. ట్యాక్సీ చార్జీ ప్రతి కిలోమీటర్ కు 60 రూపాయల నుంచి వసూలు చేస్తారు. ఒక గంట వెయిటింగ్ కు గాను 100 రూపాయలు ఉంటుుంది.
భోజనం ధర మామూలు రెస్టారెంట్లో అయితే 250 రూపాయలు, మెక్ డొనాల్డ్స్ లో అయితే 650 రూపాయల వరకు ఉంటుంది. బీర్ ధర 200 రూపాయలు. ఇంప్టోర్టెడ్ బీరు కావాలంటే రెట్టింపు చెల్లించుకోవాలి. డ్రింక్ ధర 75 రూపాయలు, వాటర్ బాటిల్ ధర 50 రూపాయలు. చట్నీస్, షణ్ముగ వంటి ప్రముఖ రెస్టారెంట్లు సైతం ఇక్కడ ఉన్నాయి. మంచి హోటళ్లలో ఒక రోజు విడిదికి గాను భారతీయ కరెన్సీలో సుమారు వెయ్యి రూపాయలు ఉంటుంది. ఇంత కంటే తక్కువ ధరల్లోనూ ఉన్నప్పటికీ శుభ్రత, సౌకర్యాల విషయంలో తేడా ఉంటుంది.

టూర్ ప్యాకేజీలు

యాత్రా సంస్థ బెంటోటా, కొలంబో నగరాల సందర్శన ప్యాకేజీని 25,550 రూపాయలకు అందిస్తోంది. చెన్నై నుంచి కొలంబో విమానాశ్రయానికి ప్రయాణం ఉంటుంది. తర్వాత హోటల్లో విడిది. రెండోరోజు నగర పర్యటన. మూడో రోజు తిరిగి కొలంబోకు తిరుగు ప్రయాణం. నగర సందర్శన తర్వాత హోటల్లో విశ్రాంతి. నాలుగో రోజు భారత్ కు తిరుగు ప్రయాణం. రానుపోను విమాన ప్రయాణం, హోటల్లో విడిది, అల్పాహారం, పర్యాటక ప్రాంతాల సందర్శన ఉచితం. ఇదే బెంటోటా, కొలంబో ప్యాకేజీని మేక్ మై ట్రిప్ సంస్థ విమానయాన చార్జీలు కాకుండా 16,290 రూపాయలకు అందిస్తోంది.
మేక్ మై ట్రిప్ సంస్థ క్యాండీ, కొలంబో నగరాల పర్యటన ప్యాకేజీని 16,290 రూపాయలకు అందిస్తోంది. రెండు రాత్రులు క్యాండీలో, ఒక రాత్రి కొలంబోలో విడిది ఉంటుంది. నాలుగో రోజు తిరుగు ప్రయాణం. రోజూ అల్పాహారం, డిన్నర్ ఉచితంగా ఏర్పాటు చేస్తారు. శ్రీలంకలో దిగిన తర్వాత వీసా అందజేస్తారు. అందుకు అయ్యే చార్జీలను సందర్శకులే స్వయంగా భరించాలి. పర్యటనలో భాగంగా క్యాండీ, కొలంబో నగరాల్లోని విశేషాలను చూపిస్తారు. ఫ్లయిట్ చార్జీలు అదనం.
ఐదు రాత్రులతో కూడిన ఆరు రోజుల ప్యాకేజీని థామస్ కుక్ సంస్థ 39,300 రూపాయలకు అందిస్తోంది. తొలిరోజు దంబుల్లా బండారు నాయకే అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన తర్వాత అక్కడి నుంచి చిలావ్ కు ప్రయాణం. రీఫ్రెష్ అయిన తర్వాత మనవరి ఆలయ సందర్శన. శ్రీరాముడు ప్రతిష్ఠించి పూజించిన మొదటి శివలింగంగా దీన్ని పేర్కొంటారు. ఇక్కడ పర్యటన పూర్తయిన తర్వాత ట్రింకోమలైకు తిరుగు ప్రయాణం. రాత్రికి అక్కడ విడిది. రెండో రోజు ట్రింకోమలై నగర సందర్శన ఉంటుంది. మూడో రోజు క్యాండీ పట్టణానికి ప్రయాణం. సైట్ సీయింగ్ ఉంటుంది.
నాలుగో రోజు నువారా ఎలియా నగరానికి తీసుకెళతారు. రంబోదా కొండపై హనుమంతుడి ఆలయం ఉంటుంది. సీతమ్మ కోసం హనుమంతుడు వెతికిన ప్రదేశంగా దీన్ని చెబుతారు. ఇక్కడికి దగ్గర్లోనే సీతమ్మ వారి ఆలయం కూడా ఉంటుంది. ఐదోరోజు కొలంబోకు తిరుగు ప్రయాణం. కొలంబోలో ఆ దేశంలో ఏర్పాటైన తొలి ఆంజనేయుడి ఆలయ సందర్శన ఉంటుంది. అలాగే, కెలనియ ఆలయానికి కూడా తీసుకెళతారు. రావణుడు యుద్ధంలో మరణించిన తర్వాత విభీషణుడిని లంకకు రాజుగా లక్ష్మణుడు ప్రకటించినది ఇక్కడేనని చెబుతారు. ఆరో రోజు కొలంబో నుంచి భారత్ కు తిరుగు ప్రయాణంతో యాత్ర ముగుస్తుంది.

సందర్శనీయ క్షేత్రాలు

కొలంబో: చూడ్డానికి ఆధునికంగా ఉంటుంది. నగరంలో ఉత్తర భాగం వ్యాపార కేంద్రంగా ఉంటే, దక్షిణ భాగం నివాసాలు, పచ్చదనంతో ఆహ్లాదంగా ఉంటుంది.
అనురాధపుర: శ్రీలంకకు తొలి రాజధాని. క్రీస్తు పూర్వం 380లో రాజధానిగా ఏర్పడగా... వెయ్యేళ్లకుపైగా సింహళీయులు అనురాధపురను రాజధానిగా చేసుకుని పాలన సాగించారు. ఇక్కడి మహాబోధి వృక్షం పవిత్ర ప్రదేశంగా గుర్తింపు పొందింది.
క్యాండీ: పర్వత ప్రాంతంలో నిర్మితమైన ఈ పట్టణం ఒకప్పుడు బౌద్ధుల రాజధానిగా విలసిల్లింది. ప్రకృతిపరమైన అందాలతో ఎక్కువ మంది పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
సిగిరియా: రాతితో కూడిన చారిత్రక ప్రదేశం. 656 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఐదో దశాబ్దానికి చెందినది. 1500 ఏళ్ల క్రితం గోడలపై వేసిన చిత్రాలు ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం విశేషం.
అకున: 43 అడుగుల ఎత్తులో ఉన్న ఐదో శతాబ్ద కాలానికి చెందిన బుద్ధ విగ్రహం ఇక్కడి ప్రత్యేకత.
యాల: దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశం 98వేల ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. చిరుతలు ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. ఇతర జంతువులకు కూడా ఇది సంరక్షణ కేంద్రంగా ఉంది.
పొలన్నరువా: 12వ శతాబ్ద కాలపు శిల్ప నిర్మాణ నైపుణ్యంతో ఉంటుంది. ప్రాచీన నీటి పారుదల పద్ధతులు, నీటి తొట్టెలు తదితర విశేషాలను ఇక్కడ చూడవచ్చు.
దంబుల్లా: ఎన్నో గుహల సముదాయం. వాటిల్లో బౌద్ధ చరిత్రకు సంబంధించిన విశేషాలను దర్శించుకోవచ్చు.
హిక్కదువా: సాగర తీరంలో రిసార్టులతో పర్యాటకులను, డైవింగ్ ప్రియులను ఆకర్షిస్తోంది.
ఉనవటున: తాబేళ్ల కేంద్రం. సంజీవని కోసం హిమాలయ పర్వత భాగాన్ని హనుమంతుడు తీసుకెళుతుండగా రాలి పడిన చిన్న భాగమే ఉనవటువగా చెబుతారు. ప్రపంచంలో ప్రముఖ అందమైన బీచ్ లలో ఇది కూడా ఒకటి.
ఉదవలావే: 30,800 హెక్టార్లలో ఉన్న ఈ నేషనల్ పార్క్ లో సుమారు 400 వరకు ఏనుగులు నివసిస్తున్నాయి. ఇతర జంతువులకు కూడా ఆవాసంగా ఉంది.
ఆడమ్స్ పీక్: సెంట్రల్ శ్రీలంకలో 7,359 అడుగుల ఎత్తయిన పర్వత ప్రదేశం. శ్రీపాదగా దీనికి పేరు. బుద్ధుడి పాద ముద్రలు ఉన్న ప్రాంతంగా చెబుతారు. చారిత్ర ప్రాధాన్యం ఉన్న ప్రదేశం.
బెంటోట: తీర పట్టణం. ఆయుర్వేద వైద్యానికి కేంద్రం. కొలంబోకు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.